ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో విడుదలైన పదో తరగతి ఫలితాలు తీవ్ర విషాదం నింపుతున్నాయి. గత 20 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా పాస్ పర్సంటేజ్ తగ్గిపోవడంతో భారీగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. కొందరు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం(Anantapur) జిల్లాలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మరవకముందే మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కృష్ణా జిల్లా పామర్రు మండలానికి చెందిన ఓ విద్యార్థి అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పదో తరగతి చదివాడు. ఇటీవలే పరీక్షలూ రాశాడు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో అతను ఫెయిల్(Tenth Exams in AP) అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పదిమందితో కలివిడిగా ఉంటూ నవ్వుతూ తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంచి చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కలలుగంటున్న కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది.
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నేకొత్తపల్లిలో ఉరి వేసుకుని ఓ విద్యా్ర్థిని, పామిడి మండలం కట్టకిందపల్లిలో విష గుళికలు తాగి మరో విద్యార్థిని, నల్లచెరువు మండలానికి చెందిన ఓ విద్యార్థిని అన్నమయ్య జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. కనగానపల్లి మండలం కుర్లపల్లితండాలో ఫినాయిల్ తాగి ఓ విద్యార్థి.. చెన్నేకొత్తపల్లి మండలంలోని ప్యాదిండికి చెందిన మరో విద్యార్థిని రసాయన ద్రావకం తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
(పరీక్షల ఫలితాలు విద్యార్థుల సాధనను తెలుసుకునేందుకే.. ఇవి వారి జీవితాలను ఏ మాత్రం నిర్ణయించేవి కావు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించాలి. పరీక్షా ఫలితాల పట్ల మానసిక ఒత్తిడికి మీరు గురవుతుంటే మానసిక వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి