Crime: మాయమాటలతో నమ్మించి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. చిన్నారిపై ఆటో డ్రైవర్ పైశాచికత్వం

దేశంలో మహిళలు, చిన్నారులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లల్లో మార్పు రావడం లేదు. తాజాగా జరిగిన హృదయవిదారక ఘటన...

Crime: మాయమాటలతో నమ్మించి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. చిన్నారిపై ఆటో డ్రైవర్ పైశాచికత్వం
Harassment

Updated on: Aug 22, 2022 | 7:55 AM

దేశంలో మహిళలు, చిన్నారులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లల్లో మార్పు రావడం లేదు. తాజాగా జరిగిన హృదయవిదారక ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. గమ్య స్థానానికి తీసుకెళ్తానని నమ్మించిన ఓ ఆటో డ్రైవర్.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించడంతో రెండు కాళ్లు విరగ్గొట్టాడు. బాలిక రాత్రంతా అక్కడే పడిగాపులు కాస్తూ సహాయం కోసం ఎదురుచూసింది. ఉదయం బాలిక దుస్థితిని చూసిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక.. రామ్‌గఢ్ లో నివాసముండే తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు స్థానికంగా ఉన్న బసుకినాథ్ బస్టాండ్‌కు చేరుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ఆమె వద్దకు ఓ ఆటో డ్రైవర్ వచ్చాడు. వెళ్లాల్సిన ప్రదేశానికి తీసుకెళ్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మి బాలిక ఆటో ఎక్కింది. అందులో అప్పటికే మరో అమ్మాయి ఉండటంతో ఆమెకు డ్రైవర్ వ్యవహారంపై అనుమానం రాలేదు. వారిద్దరినీ ఆటోలో కూర్చోబెట్టుకుని డ్రైవర్ బయల్దేరాడు. అలా అరగంట ప్రయాణం చేసిన తర్వాత వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆటోలో ఉన్న మరో మహిళ అతని బారి నుంచి తప్పించుకుని పారిపోయింది. కానీ బాలిక అక్కడి నుంచి బయటపడలేకపోయింది. తనను ఏమీ చేయవద్దని, వదిలేయాలని ప్రాధేయపడింది. అయినప్పటికీ ఆటో డ్రైవర్ లో మార్పు రాకపోగా.. కోపం కట్టలు తెంచుకుంది. బాలికను తీవ్రంగా కొట్టి రోడ్డు పక్కన పడేశాడు. బాలికకు తీవ్ర గాయాలవడంతో పాటు కాళ్లు విరిగాయి. దీంతో దిక్కులేని పరిస్థితుల్లో బాలిక రోడ్డు పక్కనే బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూసింది. రాత్రంతా అక్కడే ఉండి ఉదయాన్నే కాళ్లు ఈడ్చుకుంటూ సహాయం కోసం కేకలు వేసింది.

బాలికను గుర్తించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు వివరించారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వారు వెంటనే బాలిక వద్దకు చేరుకున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి