సంక్రాంతి పండగ వచ్చిందంటే పల్లెల్లో, పట్టణాల్లో పిండివంటలతో ఇళ్లన్నీ ఘుమఘుమలాడుతాయి.. ఆ పిండి వంటలు చేసే కాలనీ అంత సువాసనలు వెదజల్లేవి ఒకప్పుడు.. కానీ ఇప్పుడు ఆహారపదార్థాలు ఆరోగ్యంగా, రుచిగా అసలు ఉండడం లేదు. ప్రస్తుతం ఈ కల్తీ ప్రపంచంలో ప్రతి ఆహార పదార్థాలన్నీ కల్తీ చేస్తుండటంతో ప్రజలు పండగ మాట అటు వుంచితే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లక్షలు వెచ్చిస్తున్నారు.. ముఖ్యంగా అన్ని పండుగల కన్నా కూడా సంక్రాంతి పండగ సమయంలోనే మెదక్ జిల్లాలో కల్తీ ఎక్కువగా జరుగుతోంది.
సంక్రాంతి పండగ సమయంలో ఎక్కువగా నూనె పదార్థాల కల్తీ విపరీతంగా జరుగుతుంది.. లోకల్ బ్రాండ్ పేరుతో కల్తీ నూనె భారీ ఎత్తున అమ్ముడవుతోంది. 12 లీటర్ల నూనె డబ్బాలో కేవలం 10 నుండి11 కిలోల పరిమాణం ఉంటుంది.. అంటే దాదాపు 2 కిలోల నూనె తక్కువగా నింపుతున్నారు.. లీటరు నూనె ప్యాకెట్లో 700 నుండి 800 గ్రాముల నూనెను నింపి అమ్మడం ఒక ఎత్తు అయితే, పల్లి నూనె పేరు చెప్పి ప్యాకెట్లలో ఫామ్ ఆయిల్ నింపి వాటిని మార్కెట్ లోకి తెస్తున్నారు.. ఫైవ్ స్టార్ హోటల్ లో వాడిన వంట నూనెను సైతం రంగు మార్చి కొత్త తాజా నునే డబ్బాలలో రిఫిల్ చేసి వినియోగదారులకు అంట గడుతున్నారు.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇలానే కల్తీకి పాల్పడుతున్నారు అక్రమార్కులు.
మరికొందరు ఏకంగా లోకల్ బ్రాండ్ పేరుతో ఆయిల్ మిల్లులో నూనె తయారు చేసి వాటిని మార్కెట్ కు తరలిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగటమాడుతున్నారు.. ఇంత జరుగుతున్నా ఆహార శాఖ అధికారులు కానీ, తూనికలు కొలతల అధికారులు కానీ స్పందించండం లేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు.
పండగ పూట ఇలాంటి కల్తీ నూనెలు తయారు చేసి అమ్మే వారిపై.. అలాగే డబ్బాల్లో, ప్యాకెట్లలో చెప్పినదాని కంటే తక్కువ నూనెను నింపి ప్రజలను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. మరో వైపు కొంతమంది వ్యాపారులు మాత్రం ఇందులో తమకు ఏం సంబంధం లేదు అని మాకు సరఫరా చేసే వారి వద్దే పొరపాటు జరుగుతుంది.. కానీ, తమ వద్దకాదని చెబుతున్నారు.
Also Read: పదే, పదే ఎన్-95 మాస్కులు కొనాల్సిన పనిలేదు.. ఇలా క్లీన్ చేస్తే పాతికసార్లు వాడొచ్చు!