Adilabad Resident dies in US: అమెరికాలో జరిగిన ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. తమ కళ్లెదుటే కన్న కొడుకు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని భోరిగాం గ్రామానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆలేటి నిహార్ రెడ్డి (31) మూడేళ్ల నుంచి అమెరికాలోని వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో నిహార్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అనంతరం ప్రమాదశాత్తూ నిహార్ రెడ్డి సమ్మమిష్ లేక్‌లో పడి గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం గాలింపు తరువాత ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికితీశారు.
ఏలేటి లక్ష్మారెడ్డి, శోభ దంపతుల చిన్న కుమారుడు ఏలేటి నిహార్ రెడ్డి. మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన నిహార్ రెడ్డి సోదరుడు నిఖిల్ రెడ్డితో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిహార్ రెడ్డి భార్య కావ్య ఏడు నెలల గర్భిణి. అయితే.. మూడు నెలల క్రితమే ఏలేటీ లక్ష్మారెడ్డి, శోభ దంపతులు కొడుకుల వద్దకు వెళ్లారు. ఈక్రమంలో ఆదివారం కావడంతో నిహార్ రెడ్డి కుటుంబ సమేతంగా అమెరికాలోని సమ్మమిష్ లేక్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా జలపాతంలో కాలుజారి పడిపోవడంతో నిహార్ రెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిహార్ రెడ్డి మృతితో స్వగ్రామం భోరిగాంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నరేష్, టీవీ9 రిపోర్టర్, ఆదిలాబాద్ జిల్లా.
Also Read: