
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. జామకాయ కోశాడన్న కారణంగా ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. గాయపడ్డ వ్యక్తిని చూసిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రాణాలు వదిలారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అలీఘర్‌లోని గంగారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మనేగా గ్రామానికి చెందిన 25 ఏళ్ల ఓం ప్రకాశ్ అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామంలోని జామ తోటకు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు కలిసి జామకాయలను తెంపడం ప్రారంభించారు. దీంతో తోటలో కాపలా కాస్తున్న ఇద్దరు వ్యక్తులు వారిని గమనించారు.
ఈ విషయమై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతటితో ఆగకుండా ఓం ప్రకాష్‌ను కర్రలతో దాడి చేశారు. దీంతో ఆయన అక్కడిక్కడే స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఓంప్రకాష్ స్నేహితులు ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేయగానే ఘటన స్థలానికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఓంప్రకాశ్ ఆసుపత్రికి వెళ్లేలోపే మార్గ మధ్యంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. శనివారం సాయంత్రం ఓం ప్రకాష్ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..