నోరులేని మూగజీవాల పట్ల జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. కొందరు ఉద్దేశపూర్వకంగానే అమానుషంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఇతర కారణాలతో మూగ జీవాల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.
తిరుపతి రూరల్ మండలంలో నాటు బాంబు తిని ఆవు మృతి చెందింది. చందమామ పల్లెలో అడవి పందుల కోసం వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును ఆవు నమలటంతో అది పేలిపోయింది. దీంతో ఆవు ముఖం, నాలుక చిధ్రమైపోయింది. బాంబు పేలుడు ధాటికి ఆవు దవడ, నాలుక సహా ముందు భాగమంతా పూర్తిగా ఛిద్రమై పోవటంతో పశు వైద్యులు ఏమీ చేయలేకపోయారు. రక్తమోడుతూ అలాగే నాలుగు గంటల పాటు ఆ గోమాత మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయింది.
ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో నాటుబాంబులు పేలి గత రెండు నెలల వ్యవధిలోనే ఇప్పటి వరకు ఆరు ఆవులు మృతిచెందాయి. వెదురుకుప్పం, పెద పంజాని, శాంతిపురం మండలాల్లో వేటగాళ్లు ఎక్కువగా నాటు బాంబులు వాడుతుండటంతో ఆవులు బలూపోతున్నాయంటూ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.