Hyderabad : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఆభరణాలు మాయమవుతున్నాయి. రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి కుటుంబ సభ్యులు విలపిస్తుంటే మరోవైపు ఇదే అదనుగా సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గచ్చిబౌలిలో ఉన్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో పేషెంట్ల నగలు మాయమవుతున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ పేషెంట్ల కోసం ఈ సెంటర్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కానీ ఈ ఆస్పత్రిలో జరుగుతున్న కథ వేరేలా ఉంది.
సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌లో పేషెంట్లు నిలువుదోపిడీకి గురవుతున్నారు. రోగం సంగతి దేవుడెరుగు.. విలువైన వస్తువులు పోగొట్టుకొని గుండెలు బాదుకుంటున్నారు. వరుస దొంగతనాలతో టిమ్స్ ప్రతిష్ఠ మసకబారుతోంది. చికిత్స కోసం గంపెడాశతో వచ్చే రోగులకు దొంగతనాల రూపంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు పోగొట్టుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఈ దొంగతనాలపై దృష్టిసారించిన పోలీసులు టిమ్స్‌లో పనిచేసే ఇద్దరిని పట్టుకొని విచారించారు.
కూపీ లాగితే అసలు విషయం కాస్త బయటపడింది. చింతపల్లి రాజు, లతశ్రీ అనే దంపతులు పేషెంట్ల నుంచి బంగారు, వెండి నగల్ని చోరీ చేస్తున్నట్టుగా తేలింది. నిందితుల వద్ద నుంచి 10 లక్షల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తును ముత్తూట్, అట్టిక ఫైనాన్స్‌లలో కుదవ పెట్టినట్టు దర్యాప్తులో తేలింది. వీరిపై మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిందితులపై పీడీయాక్ట్ ను నమోదు చేసి రిమాండ్‌కి తరలించామని తెలిపారు.