కర్నూలు నగరంలోని రవీంద్ర, పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతోన్న సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి కళాశాల హాస్టల్లో భోజనం చేసిన పలువురు విద్యార్థుల వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. మొదట పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలోని విద్యార్థులు ఈవిషయాన్ని హాస్టల్ వార్డెన్ల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. రహస్యంగా ముగ్గురు వైద్యులను హాస్టల్ కు పిలిపించి.. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యం అందించారు. ఇక రవీంద్ర ఇంజినీరింగ్ కాలేజీలోనూ పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. రెండు కళాశాలల్లో మొత్తం 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. వీరిలో 15 మంది విద్యార్థులు పరిస్థితి తీవ్రంగానూ, మరో 5 ఐదుగురి పరిస్థితి విషమంగానూ ఉందని సమాచారం.
అయితే ఈ విషయంపై కళాశాల యాజమాన్యాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది. కనీసం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది . అందుకే ఈ విషయం బయటకు తెలియకుండా కాలేజీ యాజమాన్యాలు గోప్యత పాటిస్తున్నాయని తెలుస్తోంది.
Also Read: