Bihar Gang Rape Case: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు రెచ్చిపోతున్నారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా.. బీహార్‌లో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్‌లో కొందరు దుర్మార్గులు 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బీహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బస్ డ్రైవర్, కండక్టర్, హెల్పర్ సహా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో బాలిక వెస్ట్ చంపారన్‌లోని బెట్టయ్య ప్రాంతానికి వెళ్లడానికి ఎదురుచూస్తూ ఉంది. ఈ క్రమంలో బస్ రాగా.. ఆమె దానిని ఆపింది. అయితే.. వివరాలు అడగగా.. బస్ డ్రైవర్ బెట్టయ్య ప్రాంతానికే వెళ్తున్నట్లు చెప్పడంతో బాధితురాలు నమ్మింది.
అనంతరం బాలిక బస్ ఎక్కగానే ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇవ్వగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత బాలికపై బస్ డ్రైవర్, కండక్టర్ సహా మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. బాలిక స్పృహలోకి రాగానే.. బస్సు డోర్లు వేసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వారు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికను బెట్టియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటనలో బస్‌ను సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేశామని బెట్టియా పోలీసు అధికారి ముకుల్ పాండే తెలిపారు. పోక్సో తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సేకరించిన సాక్ష్యాల విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నట్లు పాండే తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..