AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath – Terror: అమర్‌నాథ్ యాత్రే లక్ష్యంగా ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన భారత భద్రతా దళాలు..!

Amarnath - Terror: అమర్‌నాథ్‌ యాత్రే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాలని పాక్‌ గత కొంతకాలంగా చేస్తోన్న కుట్రలను పోలీసులు, భద్రతా బలగాలు..

Amarnath - Terror: అమర్‌నాథ్ యాత్రే లక్ష్యంగా ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన భారత భద్రతా దళాలు..!
Amarnath Yatra
Shiva Prajapati
|

Updated on: Jun 09, 2022 | 5:57 AM

Share

Amarnath – Terror: అమర్‌నాథ్‌ యాత్రే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాలని పాక్‌ గత కొంతకాలంగా చేస్తోన్న కుట్రలను పోలీసులు, భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు టెర్రరిస్టులు చేస్తున్న ప్రయత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. డ్రోన్‌ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్‌ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అమర్‌నాథ్‌ యాత్రికులను టార్గెట్‌ చేసేందుకు ఉగ్రవాదులు డ్రోన్లతో స్టిక్కీ బాంబులను ప్రయోగిస్తునట్టు తాజా దర్యాప్తులో వెల్లడయ్యింది.

జమ్ము శివార్లలో పాక్‌ డ్రోన్‌ ఒకటి ఓ పేలుడును జారవిడిచింది. స్టికీ బాంబులతో కూడిన టిఫిన్‌ బాక్సులు అందులో దొరికాయి. 3, 8 గంటల్లో పేలేలా వాటికి టైమర్లు కూడా సెట్‌ చేశారు. వాటిని పోలీసులు నిర్వీర్యం చేశారు. అమర్‌నాథ్‌ యాత్రలో ప్రయోగించేందుకే వీటిని పాక్‌ నుంచి తరలించినట్లుగా తేల్చారు. చిన్న సైజుల్లో ఉండే బాక్సుల్లో పేలుడు పదార్థాలుంచి ఈ స్టికీ బాంబుల్ని తయారు చేస్తారు. వాటికి నాణెం ఆకారంలోని మాగ్నెట్లను అతికిస్తారు. దాంతో ఈ బాంబులు వాహనాలకు సులభంగా అతుక్కుంటాయి. టైమర్‌తో అనుకున్న సమయానికి వీటిని పేల్చవచ్చు. వీటి తయారీ చౌకే గాక తరలించడమూ సులభమే. వీటిని వాడే ప్రక్రియ ఒకప్పుడు కాస్త సంక్లిష్టంగా ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక అదీ సులభంగా మారింది. పార్క్‌ చేసిన వాహనాలకు వీటిని అతికించి రిమోట్‌తో పేలుస్తారు. గతంలో ఇలాంటి స్టికీ బాంబు పేలుళ్లు మన దేశంలో జరిగాయి.

స్టికీ బాంబులతో ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదమున్నందున ఈసారి అమర్‌నాథ్‌ యాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. అమర్‌నాథ్‌ యాత్ర అంటే ఆధ్యాత్మిక యాత్ర. అమర్‌నాథ్‌ యాత్ర అంటే సాహస యాత్ర. ప్రకృతిలో మమేకం అవుతూ..దైవత్వాన్నిఅర్థం చేసుకునే యాత్ర. ఒకవైపు మంచు కొండల అందాలు కనువిందు చేస్తుంటే.. మరోవైపు పొంచివున్న అపాయాలు, అనుక్షణం అప్రమత్తతను గుర్తు చేస్తుంటాయి. ప్రకృతి చాటున మాటు వేసిన ప్రమాదాలు.. అటు పొంచివున్న ఉగ్ర ముప్పు.. వాటి మధ్య యాత్రలో ధైర్యం నింపే భోలేనాధుని నామస్మరణం. వీటన్నింటి మధ్య సాహసం శివం సుందరం అన్న అద్భుతభావోద్వేగాన్ని సొంతం చేసుకోవాలంటే ఈ ఏడాది యాత్రకు సిద్ధం కావాల్సిందే.