Covid-19 Fourth Wave: దేశంలో కరోనా థర్డ్ వేవ్ తర్వాత కరోనా కేసులు (Corona Cases) భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని వారాలుగా రోజువారీ కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రెండు వేలకు దిగువన కేసులు, 100 లోపు మరణాలు నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. తాజాగా (మార్చి 25)న1,660 కేసులు నమోదు కాగా.. అంతకుముందు వరుసగా వరుస రోజుల్లో1685,1985, 1581 కేసులు నమోదయ్యాయి. ఇక కేసులు తగ్గుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు, పరిమిత సమావేశాలు లాంటి అన్ని కొవిడ్ ఆంక్షలను ఎత్తివేయాలని, అంతర్రాష్ట్ర కదలికలను నియంత్రించవద్దని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించింది. అయితే మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే చైనా, దక్షిణ కొరియా యూరప్ దేశాల్లో కొవిడ్ మహమ్మారి మరలా విజృంభిస్తోంది. దీంతో నాలుగో వేవ్ ఊహగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఇక జూన్-జూలై మధ్యలో మన దేశంలోనూ మరొక కరోనా వేవ్ రావొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో జూన్ 22 నుంచి కొవిడ్ నాలుగో వేవ్ ప్రారంభమవుతుందని, ఆగస్టు మధ్య నుంచి చివరి వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు చెబుతున్నారు.
*కాగా కరోనా నాలుగో వేవ్‌పై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఛైర్ పర్సన్ డాక్టర్ టి. జాకబ్ జాన్ న్యూస్9 తో (News9) తో మాట్లాడారు. ‘మనదేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అసలు వైరస్ ఏ దశలో ఉంటుందో మనం అంచనా వేయలేం. ఇక ఆల్ఫా, బీటా, గామా, డెల్టాలతో పోల్చుకుంటే ఒమిక్రాన్ పూర్తిగా భిన్నమైనది. అందుకే ఈ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయలేకపోయాం. ఇక ఇప్పుడు ఇలాంటి మ్యూటేషన్ మళ్లీ వస్తుందంటున్నారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. కొవిడ్ నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
* ఇదే విషయంపై పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా స్పందిస్తూ.. ‘మన దేశంలో COVID-19 మహమ్మారి ముగిసిందని నిర్ధారించడం తార్కికం. అయితే మన దేశంలో కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు వస్తాయనడానికి అవకాశాలు చాలా తక్కువే. టీకాలు తీసుకున్నా నిర్దిష్ట కాల వ్యవధిలో యాంటీబాడీలు స్థాయి క్షీణిస్థాయని తెలుసు. అయితే వ్యాక్సిన్లు హైబ్రిడ్ రోగనిరోధక శక్తి రక్షణను అందిస్తాయి’ అని చెప్పుకొచ్చారు.
* హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ప్రొఫెసర్, నేషనల్ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీ అధిపతి డాక్టర్ ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ ‘మన దేశంలో కొవిడ్ నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనదేశంలో 97 శాతం కంటే ఎక్కువ మంది కరోనా మొదటి టీకాను తీసుకున్నారు. దీంతో వారిలో యాంటీ బాడీలు చాలా రోజుల వరకు ఉంటాయి. ఫలితంగా సహజ రోగనిరోధక శక్తి ఎక్కువగా చెక్కుచెదరకుండా ఉంటుంది. కాబట్టి ఈ దశలో నాలుగో వేవ్ అనేది వస్తుందని కచ్చితంగా చెప్పలేం’
* ‘దేశంలో మరో కరోనా వేవ్ ఉంటుందని ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. నా విషయానికొస్తే.. మన దేశంలో మరోసారి కరోనా విజృంభించడం అసాధ్యమంటాను. ఎందుకంటే మన దేశంలో కరోనా టీకాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. అలాగని కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు రావని కాదు. కొవిడ్ నిరంతరం మన చుట్టూనే ఉంటుంది. ఇతర రకాల వైరస్‌లతో చేసినట్లుగానే కరోనాతో జీవించడం మనం నేర్చుకోవాలి. కరోనా 2022లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ వైరస్ తీవ్రత మరీ ఎక్కువగా ఉండదు ‘ అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జయప్రకాష్ ముల్యిల్ చెప్పుకొచ్చారు.
*ప్రముఖ పల్మోనాలజిస్ట్, డాక్టర్ మార్క్ లాన్సెలాట్ పింటో మాట్లాడుతూ.. ‘కొవిడ్ లేదా దాని వేరియంట్‌లు మళ్లీ వచ్చినా, రాకపోయినా మనం వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. ఆయా రాష్ట్రాలు కూడా ఆరోగ్య సదుపాయాలను మెరుగుపర్చుకోవాలి. దీన్ని బట్టే జూన్ లేదా ఆగస్టులో కొవిడ్ నాలుగో వేవ్ ప్రభావం మనపై ఉంటుంది ‘ అని చెప్పుకొచ్చారు.
* ‘నాలుగో వేవ్ మరొక కోవిడ్ ఉప్పెన ఉంటుందని నేను అనుకోను. దేశంలో కరోనా టీకా పంపిణీ చురుగ్గా సాగుతోంది. వృద్ధులకు కూడా బూస్టర్ డోసులు అందించాం. కాబట్టి ఇప్పుడు మన దృష్టి కేవలం భయంతో జీవించడమే కాకుండా అన్ని పరిమితులను తొలగించడంపై ఉండాలి. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు కానీ మనం ప్రతిదీ సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి సారించాలి’ అని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ హనీ సాల్వా పేర్కొన్నారు.
*ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం కో-డైరెక్టర్ డాక్టర్ ఓం శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘ దేశంలో కరోనా నాలుగో వేవ్ ఉంటుందా? లేదా? ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. కరోనా వైరస్ మారుతూనే ఉంటుంది. అది వైరస్ స్వభావం. అయితే అది ఏ మేర మనపై ప్రభావం చూపుతుందని మనం చెప్పలేం. మొదటి, రెండు, మూడో వేవ్‌లు ఎప్పుడు వస్తాయో, ఎలా ముగిశామయో మనం అంచనా వేయలేకపోయాం. అలాగే ఏ వేరియంట్లు, మ్యూటేషన్లు మనపై ఎలా దాడి చేస్తాయో ఊహించలేకపోయాం. ఫైనల్‌గా నేను చెప్పదేమిటంటే.. ఎలాంటి వేరియంట్లు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ‘ అన్నారు.
* AIIMSలోని సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ స్పందిస్తూ ‘ కరోనాతో గతేడాది మన దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇది చాలా దురదృష్టకరం. అయితే ప్రస్తుత పరిస్థతులు చాలా వేరు. ఎందుకంటే టీకాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. వాటి ద్వారా సహజ శరీరంలో చాలా రోజుల వరకు యాంటీ బాడీలు ఉంటాయి. వైరస్‌ల నుంచి రక్షణ కలిగిస్తాయి. కాబట్టి ఫోర్త్ వేవ్ మనపై మరీ ప్రభావమేమీ చూపదనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.
*ఇదే విషయంపై ముంబైలోని పరేల్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ పల్మోనాలజీ క్రిటికల్ కేర్ డాక్టర్ హరీష్ చాఫ్లే మాట్లాడుతూ ‘చైనా, జర్మనీ, యుఎస్‌ఏ వంటి కొన్ని దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాలుగో వేవ్ గురించి పుకార్లు షికార్లు వినిపిస్తున్నాయి. భారతదేశంలో కూడా మూడు వేవ్‌లు పూర్తయ్యాయి. 19వ శతాబ్దం ప్రారంభంలో మన దేశంలో విజృంభించిన మహమ్మారులను ఒకసారి పరిశీలిస్తే.. మొదటి, రెండు, మూడు… ఆపై నాలుగు, ఐదో వేవ్‌లతో మహమ్మారి పూర్తిగా చనిపోతుంది. ఇక రెండో వేవ్‌లో డెల్టా వేరియంట్, మూడో వేవ్‌లో ఒమిక్రాన్ లాంటి వేరియంట్లను, మ్యూటేషన్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. టీకాల పంపిణీ కూడా చురుగ్గా ఉండడం వల్ల మనదేశంలో నాలుగో వేవ్ రాదని భావిస్తున్నాం. అయితే మనం మాత్రం వైరస్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే’ అని హెచ్చరించారు.
* ఫోర్టిస్ హాస్పిటల్‌లోని పల్మోనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వికాస్ మౌర్య స్పందిస్తూ ‘ భవిష్యత్తులో కొవిడ్ వైరస్ ఎలా రూపాంతరం చెందుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే.. ఆల్ఫా, గామా, డెల్టా, ఓమిక్రాన్ ..ఇలా ఎన్నో వేరియంట్లు, మ్యూటేషన్లు మనపై దాడిచేశాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మనం ఖచ్చితంగా COVID ప్రొటోకాల్‌లను పాటించడం కొనసాగించాలి. ఎందుకంటే వైరస్ మన చుట్టూనే ఉంది. వీలైనంత వరకు టీకాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఏదేమైనా మన దేశంలో కరోనా నాలుగో వేవ్ వస్తుందని నేను భావించడం లేదు’ అని చెప్పుకొచ్చారు.
Also Read:Viral News: అంతకు మించిన ఫ్రెండ్‌షిప్.. వీరిద్దరికీ ఒకే భర్త కావాలట.. షాకింగ్ ప్రకటన..!
CSK vs KKR: కోల్‌కతా టార్గెట్ 132.. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనీ..
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం