
కరోనా సృష్టిస్తున్న విలయం అంతాఇంతా కాదు.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు, పాలకులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. కరోనా మహమ్మారి ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలియక ప్రజలు క్షణ క్షణం భయం భయంగా గడపాల్సిన దుస్థితి నెలకొంది. తప్పక మాస్క్ ధరించాలి, చేతులకు శానిటైజర్ రాసుకుంటూ పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులకు శానిటైజర్ రాసుకునే క్రమంలో ఓ బస్సు డ్రైవర్ స్టిరింగ్ వదిలిపెట్టాడు. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు కేకలు పెట్టారు. ఈ సంఘటన వేములవాడ మండలం అగ్రహారం సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా…
సిరిసిల్ల డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు శుక్రవారం కరీంనగర్ నుంచి సిరిసిల్లకు బయలుదేరింది. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని కరీంనగర్ పాల డెయిరీ వద్దకు రాగానే.. డ్రైవర్ స్టీరింగ్ విడిచి పెట్టి చేతులకు శానిటైజర్ రాసుకుంటున్నాడు. ఇంతలో బస్సు అదుపుతప్పి డివైడర్ మీదకు దూసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశాడు. కాగా బస్సులో దాదాపు 20 మంది వరకు ఉన్నట్లు ప్రయాణికులు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడడంతో బస్సులో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.