ఆంధ్రప్రదేశ్ లోకొవిడ్ మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 94,550 నమూనాలను పరీక్షించగా… 24,171 మందికి వైరస్ సోకినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. తాజాగా 101 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,372కి పెరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ జనాన్ని కట్టడి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనాపై అవగాహన కలిగిస్తూ.. ఆంక్షలు, నిబంధనల అమలుకు సహకరించాలని కోరుతున్నారు.