Face Mask: కరోనా వైరస్ మహమ్మారి మరోమారు చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పుడు డెల్టా, ఒమైక్రాన్ అంటూ కొత్త వేరియంట్‌తో విరుచుకుపడుతుంది. ఇటువంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో అవసరం. కరోనా వైరస్ కారణంగా మాస్కుల వాడకం అధికమైంది. ఇందుకోసం ఎన్ 95 ఫేస్ మాస్క్‌లు (N95 Mask ) ఉపయోగించడం అత్యధికమైంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే. మాస్కులు ధరించడం వల్ల గాల్లో ఉండే వైరస్ నోటి ద్వారా వ్యాపించదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూఎస్‌లోని రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది.
కరోనా వైరస్‌ను చంపే కొత్త ఎన్-95 మాస్కును తయారు చేసినట్లు పరిశోధకుడు ఎడ్మండ్ పలెర్మో తెలిపారు. ఈ మాస్క్ మిమ్మల్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఇతర జెర్మ్స్ నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ మాస్కును ఎక్కువ రోజుల వరకు వాడవచ్చని పేర్కొన్నారు. పాలీప్రొఫైలిన్ అనే రసాయనాన్ని వాడి ఎన్-95 మాస్కును తయారు చేసినట్లు ఎడ్మండ్ తెలిపారు. దీని వల్ల వైరస్ మాస్కులోకి ప్రవేశించకుండా అక్కడే అడ్డుకుంటుందని, ఆ తర్వాత వైరస్‌ను చంపేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మాస్కును ధరించడం వల్ల వైరస్‌ను సమర్థవంతంగా నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ మాస్కును ధరించడానికి కంఫర్ట్ గా ఉంటుందని, శ్వాసకోశ సమస్య తలెత్తవని, ఇది పూర్తిగా సురక్షితమని ఎడ్మండ్ సూచించారు. త్వరలోనే ఈ మాస్కులు వాడుకలోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని కోవిడ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి