ఇండియాలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు.. ఐసీఎంఆర్
ఇండియాలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక సామాజిక వ్యాప్తి దశలోకి దేశం ప్రవేశించిందన్న..

ఇండియాలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక సామాజిక వ్యాప్తి దశలోకి దేశం ప్రవేశించిందన్న ఊహాగానాలు మొదలయ్యాయని పేర్కొంది. అసలు సామాజిక వ్యాప్తి అన్న పదానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్వచనం ఇవ్వలేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. ఈ పదంపై చర్చ ఇంకా విస్తృతంగా జరుగుతోందన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగాయన్నారు. నిజానికి ఢిల్లీలో నిన్న డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా.. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి కూడా తమ ముంబై నగరంలో సామాజిక వ్యాప్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. కంటెయిన్మెంట్ జోన్లలో లేదా సీల్ చేసిన ప్రాంతాల్లో ట్రేసింగ్ లో కొంత ‘గ్యాప్స్’ వఛ్చి ఉండవచ్చునని, ఈ ట్రేసింగ్ ని సరిగా నిర్వహించలేకపోతే అధికారులు ఇన్ఫెక్షన్ మూలాన్ని కనుగొనలేకపోతారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇలాంటి జోన్లలో కేసులు పెరుగు తూనే ఉంటాయని చెప్పిన ఆయన… ప్రస్తుతం దేశంలో రీకవరీ రేటు 49.21 శాతం ఉన్నట్టు వెల్లడించారు. అంటే యాక్టివ్ కేసులకన్నా రికవరీ కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.



