Maharashtra Coronavirus Updates: దేశవ్యాప్తంగా కరోనాసెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, నాలుగు వేలకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో ఆందోళన నెలకొంది. కాగా.. దేశంలో కరోనా ప్రారంభం నాటినుంచి కేసులు, మరణాల పరంగా మొదటిస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో మహమ్మారా ఉదృతి తగ్గుముఖం పడుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసుల కన్నా.. రికవరీ రేటు భారీగా పెరుగుతోంది.
మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 28,438 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 679 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 54,33,506 కి చేరగా.. మరణాల సంఖ్య 83,777కి పెరగింది. ఈ మేరకు మహరాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతోపాటు కరోనా నుంచి 52,898 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 49,27,480 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,19,727 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా ముంబై మహానగరం, పూణే పట్టణంలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ముంబైలో 954 కేసులు నమోదు కాగా.. 44 మంది మరణించారు. రోజూవారిగా నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ముంబైలో భారీగా కేసుల సంఖ్య తగ్గింది. పూణే జిల్లాలో అత్యధికంగా 3,741 కేసులు నమోదు కాగా.. 108 మంది మరణించారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం మహారాష్ట్ర కంటే కూడా కర్ణాటకలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో అత్యధికంగా కేసులు నమోదయ్యే స్థానంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.
Also Read;