Kerala Neuro Virus: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే కొత్త రకం వైరస్ గుబులు రేపుతోంది. దేశంలోనే తొలి కరోనా కేసు నమోదైన కేరళలో న్యూరో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో పొరుగున ఉన్న రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి కేరళకు సరిహద్దు జిల్లాలైన దక్షిణకన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడలలో అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, అనుమానం తలెత్తిన సమక్షంలో వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. న్యూరోవైరస్‌తో బాధపడుతున్న వారిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటున్నాయని అధికారులు అంటున్నారు. నీరు, ఆహారం ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు గుర్తించామన్నారు. కేరళ వైద్యులు గుర్తించిన ఏడుగురు రోగులలో ఆరుగురు మహిళలు కాగా, వారంతా 50-70 ఏళ్లలోపు వారే. వారు కేరళలోని ఎర్నాకులం, కొట్టాయం మరియు కన్నూర్ జిల్లాలకు చెందినవారు.
ఇదిలావుంటే, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని పొందిన 12 లక్షల మందిలో ఒక నెలలోపు అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన గులియన్-బారే సిండ్రోమ్‌కు సంబంధించిన ఏడు కేసులను గుర్తించినట్లు కేరళ వైద్యులు తెలిపారు. వ్యాక్సిన్ గ్రహీతలలో GBS కోసం ఇతరులను అప్రమత్తం చేయాలని వారు సూచిస్తున్నారు. GBS అనేది రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి. పాదాలు, కాళ్లలో బలహీనత, జలదరింపు వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఈ లక్షణాలు త్వరగా ఎగువ శరీరానికి వ్యాప్తి చెందుతాయి. ఇది కొన్ని సందర్భాలలో పక్షవాతానికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి తీవ్రమైన బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా ప్రేరేపించవచ్చు. అటువంటి వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. భయపడాల్సిన పనిలేదని సకాలంలో ఆసుపత్రి వెళ్లి చికిత్స తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మరోవైపు, కరోనా అనంతరం హఠాన్మరణాల సంఖ్య పెరిగిపోతున్న వైనం కూడా ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచే స్తోంది. ఏమాత్రం ముందస్తు లక్షణాలు లేకుండానే బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ వంటి తీవ్ర సమస్యలకు గురవుతున్నవారు అధికమవుతున్నారని తెలిపింది. కొవిడ్ అనంతర ఆరోగ్య పరిస్థితులతో వీటికి సంబంధం ఉందా అనే కోణంలో వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. 2020 నుంచి రాష్ట్రంలో హఠాన్మర ణాల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ అవధి కూడా అదే కావడం గమనార్హం. 2020లో 49,925మంది ఇలా హఠాన్మరణాలకు గురయ్యారని ఇందులో 28,680మంది గుండెపోటుకు గురై మృతి చెందారని ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. 45-55ఏళ్లలోపువారిలోనూ, 18 ఏళ్లలోపు వారిలోనూ ఈ సమస్యలు ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై లోతుగా పరిశీలన జరిపి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆరోగ్యశాఖ నిపుణులకు సూచించినట్టు శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ బెంగళూరులో బుధవారం మీడియాకు తెలిపారు.
Read Also…. Viral News: ఐస్‌లాండ్‌లో ఆవు బొమ్మను పోగొట్టుకున్న చిన్నారి… దానిని తిరిగి చిన్నారి చెంతకు చేర్చిన నెటిజన్లు