India Coronavirus: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య ఇప్పటికే రెండున్నర లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 3,62,727 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా.. 4,120 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,3,665 కు పెరిగింది. దీంతోపాటు కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,58,317 కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కాగా.. దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3,52,181 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,97,34,823 మంది ఈ మహమ్మారి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,10,525 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 18,64,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 30,94,48,585 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న 18.94లక్షల మందికి టీకా అదించారు. ఇప్పటి వరకు దేశంలో 17,72,14,256 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: