దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి… ప్రస్తుతం 8 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు.. 10లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చింది. రోజూ లక్షన్నరకు చేరువగా కేసులు నమోదవుతున్నాయి. కోటీ 30 లక్షలను క్రాస్ చేసింది మొత్తం కేసుల సంఖ్య.
India coronavirus cases: దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చింది. రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కోటీ 30 లక్షలను క్రాస్ చేసింది మొత్తం కేసుల సంఖ్య. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు రికార్డవుతున్నాయి. కొన్ని వారాలుగా ఎన్నడూ లేనంత వేగంగా మహమ్మారి విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11,73,219 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,45,384 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక నిన్న ఒక్కరోజే 794 మంది కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,32,05,926 చేరగా.. 1,68,436 మంది మరణించినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపేు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. నిన్నటికి 10,46,631మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 8 శాతానికి చేరుకుంది. మరోవైపు, రికవరీ రేటు 90.8శాతానికి పడిపోయింది. అయితే, నిన్న ఒక్కరోజే 77,567 మంది కోలుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాను జయించిన వారి సంఖ్య కోటీ 20లక్షలకు చేరువైంది. దీంతో ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలుచేస్తున్నాయి. రాత్రి సమయాల్లో కర్ఫ్యూతో పాటు భారీ ర్యాలీలు, వేడుకలపై నిషేధం విధించాయి.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/pNLXExbgR1
— ICMR (@ICMRDELHI) April 10, 2021
ఇదిలావుంటే కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా మహారాష్ట్ర వణికిపోతుంది. దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధిక భాగంగా మహారాష్ట్ర కావడం విశేషం. తాజాగా 58,993 మందికి వైరస్ సోకగా..301 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32లక్షలకు పైబడగా..57వేల మందికిపైగా ప్రాణాలు వదిలారు. ఇక ఇప్పటివరకు సుమారు 27లక్షల మంది కోలుకున్నారు. వైరస్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 5,36,063 మందికి చేరింది. సగానికిపైగా క్రియాశీల కేసులు ఈ ఒక్కరాష్ట్రంలోనే నెలకొని ఉండటం తీవ్రతను వెల్లడిచేస్తోంది.
ముఖ్యంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి సహా పలు రాష్ట్రాలు కరోనా రూల్స్‌ను కఠినతరం చేశాయి. ఇవాళ్లి నుంచి తమిళనాడుకు వచ్చేవారికి ఈపాస్ తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు, కరోనా విజృంభణతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతలతో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై చర్చించనున్నారు.
ఇక ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్లు కూడా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. సర్ గంగారామ్ హాస్పిటల్, ఎయిమ్స్ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో వైద్యులు, హెల్త్‌కేర్ వర్కర్స్ కరోనా బారినపడ్డారు. దీంతో ఎయిమ్స్‌లో నేటి నుంచి అత్యవసర సర్జరీలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం చురుకుగా సాగుతోంది. నిన్నటివరకు 9,80,75,160 మందికి కోవిడ్ టీకా డోసులు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 34,15,055 మందికి టీకా వేయించుకున్నట్లు పేర్కొన్నారు.
Read Also… మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం… ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌ల రద్దు