Election Commission: ఆత్మావలోకనంలో కేంద్ర ఎన్నికల సంఘం? చివరి అంకంలో దిద్దుబాటు చర్యలు!
కేంద్ర ఎన్నికల సంఘం ఆత్మవలోకనంలో పడిందా..? దేశంలో కరోనా సెకెండ్ వేవ్ పెరగడానికి పరోక్షంగా తమ నిర్ణయమే కారణమని భావిస్తోందా..? ఫలితంగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందా..? కాస్త లోతుగా ఆలోచిస్తే నిజమేనని...
Election commission under introspection: కేంద్ర ఎన్నికల సంఘం (ELECTION COMMISSION OF INDIA) ఆత్మవలోకనంలో పడిందా..? దేశంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA VIRUS SECOND WAVE) పెరగడానికి పరోక్షంగా తమ నిర్ణయమే కారణమని భావిస్తోందా..? ఫలితంగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందా..? కాస్త లోతుగా ఆలోచిస్తే నిజమేనని అనిపిస్తోంది. కరోనా వైరస్ (CORONA VIRUS) ప్రభావాన్ని అంఛనా వేయకుండా.. సుదీర్ఘంగా సాగే అయిదు అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్దమైంది. తీరా ఎన్నికల ప్రహసనం కొనసాగుతున్న తరుణంలో దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ శరవేగంగా విస్తరించడం మొదలు పెట్టింది. గత 2020 సంవత్సరంలో వచ్చిన కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మనదేశంలో విజృంభిస్తోంది. ఫలితంగా దేశంలో ప్రతీ రోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర (MAHARASHTRA), చత్తీస్ గడ్ (CHATTISGADH), కేరళ (KERALA), తమిళనాడు (TAMILNADU), ఢిల్లీ (DELHI) ప్రాంతాలలో కరోనా విలయ తాండవం చేస్తోంది.
ఈ నేపథ్యంలో గత రెండు, మూడు నెలలుగా దేశంలో నెలకొన్ని పరిస్థితులను, పరిణామాలను, ఈవెంట్లను ఆధారం చేసుకుని పలువురు నిందారోపణలు మొదలు పెట్టారు. దేశంలో అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ఎన్ని కల సంఘం (CENTRAL ELECTION COMMISSION) నిర్ణయాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌ని అంఛనా వేయకుండా సుదీర్ఘంగా దాదాపు మూడు నెలల పాటు సాగే అయిదు అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలు, పాదయాత్రలు, బహిరంగ సభలు దేశంలో కరోనా సెకెండ్ వేవ్‌కు కారణమయ్యాయని చాలా మంది భావిస్తున్నారు.
నిజం చెప్పాలంటే దేశానికి కరోనా వైరస్ కేసులను అత్యధిక స్థాయిలో అందిస్తున్న మహారాష్ట్రలో ఇటీవల కాలంలో ఎన్నికలు గానీ.. మత సంబంధమైన పెద్ద కార్యక్రమాలు గానీ జరగలేదు. కానీ మహారాష్ట్రలో ఇపుడు దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముంబయి (MUMBAI), పుణె (PUNE), నాగ్‌పూర్ (NAGPUR) నగరాలు కరోనా వైరస్ వ్యాప్తికి హబ్‌లుగా మారాయి. యుకే వేరియంట్ కరోనా వైరస్ (UK VARIANT CORONA VIRUS) మన దేశంలో తొలిసారి నమోదు అయ్యింది మహారాష్ట్రలోనే. అక్కడి అనుభవ రహితమైన ఉద్దవ్ థాక్రే (UDDAV THAKRE) ప్రభుత్వం యుకే వేరియంట్ కరోనా వైరస్ ప్రవేశించిన తొలి నాళ్ళలో సరిగ్గా స్పందించి వుంటే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఇంతటి భయంకరమైన స్థాయిలో వుండేది కాదు. ఇక ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాన్ని పరిశీలిస్తే.. తమిళనాడు, కేరళ మినహా మిగితా మూడు చోట్ల కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎఫెక్టు పెద్దగా లేదు. అంటే ఎన్నికల నిర్వహణ నిర్ణయమే దేశంలో రెండో వేవ్‌కి కారణమని చెప్పడానికి ఆధారాలు ఫిఫ్టీ.. ఫిఫ్టీ అనే భావించాలి.
కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో కొంత తమ నిర్ణయమే దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌కు కారణమని భావించింది. అందుకే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ తుది దశకు చేరుకుంది. అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు పుదుచ్ఛేరి కేంద్ర పాలిత ప్రాంతానికి పోలింగ్ ముగిసింది. సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో కొనసాగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఆఖరి విడత పోలింగ్ మిగిలి వుంది. తుది విడత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మే రెండో తేదీన అయిదు అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. అయితే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో తమ నిర్ణయంపై ఆత్మావలోకనం చేసుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు కనిపిస్తోంది.
మే 2న విడుదలయ్యే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సమయంలో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ఫలితాలు వచ్చేటప్పుడు గానీ.. ఆ తర్వాత గానీ.. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, పార్టీ సంబరాలేవీ నిర్వహించకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఫలితాల అనంతరం గెలిచినవారు ఈసీ నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలోనూ గెలిచిన క్యాండిడేట్ వెంట ఇద్దరు మించి ఉండకూడదని ఎన్నికల సంఘం తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఈసీ ఆదేశించింది.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతుండగా.. ఒక్క బెంగాల్ అసెంబ్లీకే ఎనిమిది దశల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 29 ఈ ఎన్నికలు ముగుస్తాయి. వీటి కౌంటింగ్ మే 2 తేదీన చేపట్టనున్నారు. మరోవైపు దేశంలో కొన్ని రోజులుగా నిత్యం 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 2 వేలకు మించి కరోనా రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో కోవిడ్ కేసులు పెరిగి పోవడానికి ఎన్నికల కమిషన్‌యే కారణమని మద్రాస్ హైకోర్టు సోమవారం ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల రోజు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఏప్రిల్ 30 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే కౌంటింగ్‌ను నిలిపివేస్తామని హెచ్చరించింది. మద్రాస్ హైకోర్టు హెచ్చరించిన మరుసటి రోజే ఈసీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే విధంగా గత వారమే పశ్చిమ బెంగాల్‌లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు, ర్యాలీలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిషేధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. అయితే.. ఎన్నికలు జరుగుతున్న ప్రదేశాల కంటే.. ఎన్నికలుగానీ, మత సంబంధమైన కార్యక్రమాలు లేని మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలోనే కరోనా ఎక్కువ కేసులు నమోదు అవుతుండడం గమనార్హం.