AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Free village: దుగ్గిరాలపాడు.. కృష్ణా జిల్లాలోని ఈ గ్రామానికి క‌రోనా అంటలేదు.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సెల్యూట్

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేదు.. అంతటా మహమ్మారి ప్రతాపం చూపెడుతోంది. కానీ, ఓ మారుమూల గ్రామానికి...

Corona Free village: దుగ్గిరాలపాడు.. కృష్ణా జిల్లాలోని ఈ గ్రామానికి క‌రోనా అంటలేదు.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సెల్యూట్
Corona Free Village
Ram Naramaneni
|

Updated on: May 22, 2021 | 5:47 PM

Share

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేదు.. అంతటా మహమ్మారి ప్రతాపం చూపెడుతోంది. కానీ, ఓ మారుమూల గ్రామానికి మాత్రం కరోనా అంటలేదు. అక్కడి వారికి కరోనా భయం లేదు. ఇది కృష్ణా జిల్లాలోని దుగ్గిరాలపాడు గ్రామం.. ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణతో సెకండ్‌ వేవ్‌ని సైతం తట్టుకుని ఆదర్శగ్రామంగా నిలబడ్డారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలానికి 14 కిలో మీటర్లు దూరంలో తెలంగాణ బోర్డర్‌లో ఉంటుంది దుగ్గిరాలపాడు. ఈగ్రామంలో వెయ్యి మంది జనాభా ఉన్నారు. ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. సమస్యల్లో ఐక్యమత్యం ప్రదర్శించడం ఈ ఊరిని తొలినుంచీ విలక్షణంగా నిలిపింది. అదే లక్షణం కరోనా సెకండ్‌ వేవ్‌లో కవచంలా దుగ్గిరాలపాడును కాపాడుతోంది.

ఈ ఏడాది మార్చినుంచి మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న సమయంలో గ్రామంలోని పెద్దలంతా సమావేశమయ్యారు. గ్రామంలోకి కరోనా రాకుండా చూసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపై గ్రామస్థులు కొన్ని సమావేశాలు వేసుకొని సుదీర్ఘంగా మాట్లాడుకొని, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా ఊళ్లో పనులు దొరకనివారు దూరప్రాంతాలకు వెళ్లి కూలీపనులు చేసుకొని సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. వారిద్వారా కరోనా గ్రామంలోకి వస్తుందని భావించి.. బయటి ప్రయాణాలు పూర్తిగా బంద్‌ పెట్టారు. తప్పని పరిస్థితుల్లో బయటి ప్రాంతాల నుండి ఒకరిద్దరు మాత్రమే గ్రామానికి కావలసిన వస్తువులను జాగ్రత్తగా తీసుకొచ్చేలా పటిష్ట కార్యాచరణ రూపొందించుకున్నారు. గ్రామంలోని వ్యవసాయ కూలీలకు గ్రామంలోనే పనికి ఆహార పథకం క్రింద ఆసరా కల్పించి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఆదుకోవడానికి అధికారుల సహకారం కోరారు. ప్రతిరోజూ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామంలో పిచికారి చేయిస్తూ పంచాయతీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఒకేసారి కిరణా షాపుల వద్ద గుమిగూడకుండా.. ఒక్కో వార్డు ప్రజలు ఒక్కోరోజు చొప్పున వెళ్లి కావాల్సిన సరుకులు, కూరలు తెచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఇక.. బంధువుల ఇళ్లకు వెళ్లడం మానేశారు. తమ ఇళ్లకు బంధువులు ఎవరూ రావద్దని ఫోన్‌ల ద్వారా సమాచారం ఇచ్చారు. అనవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం మానివేశారు. మాస్క్‌లు ధరించే ఉపాధి పనులకు, వ్యవసాయ పనులకు వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం సర్కిల్ సీఐ పి.శ్రీను గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులను అభినందించారు. దుగ్గిరాలపాడు గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎన్ని కర్ఫ్యూలు పెట్టినా, లాక్ డౌన్ లు అమలు చేస్తున్నా లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే జనం ఈ గ్రామాన్ని చూసైనా మారాలని ఆశిద్దాం.

Also Read: ఆర్​ఎంపీ, పీఎంపీలకు కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ వార్నింగ్… క‌రోనాకు చికిత్స చేస్తే క్రిమిన‌ల్ కేసులు

ఆనందయ్య కరోనా మందుతో ప్రాణాలు నిలబడ్డాయని చెప్పిన రిటైర్డ్ మాస్టారు ఆరోగ్య పరిస్థితి మళ్లీ మొదటికి.!