కరోనా బఫర్ జోన్‌లోకి సీఎం జగన్ నివాసం !
కేసుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా ఆయా ప్రాంతాలను విభజించారు అధికారు. తాజాగా ఏపీ సీఎం జగన్ నివాసం కూడా బఫర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం...
దేశంలో కరోనా భూతం జడలు విప్పుకుంటోంది. రోజురోజుకూ మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రతాపం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ విలయతాండవం చేస్తోంది. తాజాగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 700లకు చేరగా, ఏపీలో కోవిడ్ కేసులు 534కి చేరాయి. తెలంగాణలో 18 మంది చనిపోగా, ఏపీలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా ఆయా ప్రాంతాలను విభజించారు అధికారు. తాజాగా ఏపీ సీఎం జగన్ నివాసం కూడా బఫర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం.
మంగళగిరి కమర్షియల్ టాక్సెస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తాడేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆ అపార్టుమెంట్‌లో వ్యక్తులు బయటకు రాకుండా నిబంధనలు అమలు చేస్తున్నారు. అపార్టుమెంట్‌లో పనిచేసే వాచ్‌మెన్.. ఇళ్లలో పనిచేసే వారి వివరాలు సేకరించి పలువురిని క్వారెంటైన్‌కు తరలించారు. ఆ ప్రాంతంవైపు ఎవర్నీ వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.
అపార్ట్‌మెంట్‌కి చుట్టుపక్కల ఓ కిలోమీటర్ వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం, చుట్టుప్రక్కల గ్రామాలను మూడు జోన్లుగా విభజించారు. మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఏడు కిలో మీటర్ల పరిధిని బఫర్ జోన్ గా ప్రకటించారు. ఇప్పుడు సీఎం జగన్ నివాసముంటున్న ప్రాంతం కూడా బఫర్ జోన్‌లోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.