Uttar Pradesh Curfew: దేశమంతటా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటి ఆంక్షలు విధించి కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో మళ్లీ వాటి గడువును పెంచుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడగిస్తూ యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనావైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు, రంజాన్ పండుగ తర్వాత గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ లాక్‌డౌన్‌ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఏప్రిల్ 29 న వారాంతపు బంద్ చేపట్టారు. తర్వాత దానిని మే 4, మే 6 వరకు, ఆ తర్వాత మే 10 వరకు పొడగించారు. అయితే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో.. మే 17 న ఉదయం 7 గంటల వరకు కరోనా కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా కేసుల నియంత్రణపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. మే 17 న ఉదయం ఏడు గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అవసరమైన సేవలకు మాత్రమే మినహాయింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ప్రోటోకాల్‌ను పకడ్బంధీగా అమలు చేస్తేనే కరోనా కర్ఫ్యూ ప్రయోజనం విజయవంతమవుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రజలంతా నిబంధనలు పాటించాలని సూచించారు.
Also Read: