తెలుగు రాష్ట్రాల్లో కరోనా హైరానా..

విరుచు కుపడుతున్న కరోనా మహమ్మారి ఇటు ప్ర‌జ‌లు, అటు అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

  • Jyothi Gadda
  • Publish Date - 7:25 am, Tue, 21 April 20
తెలుగు రాష్ట్రాల్లో కరోనా హైరానా..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ
ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తీవ్రత కొన‌సాగుతోంది. ఏమాత్రం అడ్డూఅదుపు లేకుండా విరుచు కుపడుతున్న కరోనా మహమ్మారి ఇటు ప్ర‌జ‌లు, అటు అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా 24 గంటల్లోనే ఏపీలో రికార్డు స్థాయిలో 75 పాజిటీవ్‌ కేసులు న‌మోదు కాగా, ఇటు తెలంగాణ‌లో 14 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇక రాష్ట్రాల వారిగా వైర‌స్ తీవ్ర‌త‌ను ప‌రిశీలించ‌గా….
ఆంధ్ర‌ప్ర‌దేశ్ః
ఏపీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మొత్తం 3775 నమూనాలు సేకరించి, పరీక్షించగా.. వాటిలో 75 మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 722 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25 కేసులు, గుంటూరులో 20, కర్నూలులో 16, అనంతపురంలో 4, కృష్ణాలో 5, తూర్పుగోవరిలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లా అత్యధిక కేసులతో  ముందు వ‌రుస‌లో ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 174 పాజిటీవ్‌ కేసులు న‌మోద‌య్యాయి. తర్వాత స్థానంలో గుంటూరు ఉంది. ఇక్కడ 149 మందికి కరోనా సోకింది. కృష్ణా జిల్లాలో 80, చిత్తూరులో 53, నెల్లూరులో 67, ప్రకాశంలో 44, కడపలో 40, విశాఖలో 21, తూర్పుగోదావరిలో 26, పశ్చిమ గోదావరిలో 35 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో 92 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  20 మంది కరోనా బాధితులు మరణించారు.
తెలంగాణః
రాష్ట్రంలో  కరోనా వైరస్ (కోవిడ్ 19) పంజా విసురుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. సోమవారం ఉదయం నుంచి కొత్తగా మరో 14 కేసులు నమోదైనట్లు రాత్రి 8 గంటల బులిటెన్‌‌లో తెలియజేశారు. కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 12 కరోనా కేసులు, మేడ్చల్‌లో ఒకటి, నిజామాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 14 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 872కు పెరిగింది. సోమ‌వారం క‌రోనా కార‌ణంగా మ‌రో ఇద్ద‌రు మృతిచెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 23కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 186 మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 663కు తగ్గింది.