Corona positive: కంటికి కనిపించని కరోనా.. కోరలు చాస్తూ ఇంకా బుసలు కొడుతూనే ఉంది. గత నెల క్రితం వరకు కాస్త తగ్గాయనుకున్న కేసులు.. మళ్లీ విజృంభిస్తున్నాయి. రోజురోజుకు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. తగ్గినట్టే తగ్గిన కోవిడ్ వైరస్ కేసులు.. మళ్లీ భారీగా బయటపడుతున్నాయి.
తాజాగా జగిత్యాల జిల్లాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మల్లాపూర్ మండలంలో కరోనా కలకలం సృష్టించింది. సిరిపూర్‌లో పది రోజుల క్రితం ఓ వ్యక్తి మరణించగా.. ఆ వ్యక్తి దశదిన కర్మలో పాల్గొన్న 26 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రాకేశ్ తెలిపారు.
ఓ వ్యక్తి దశదిన కర్మలో పాల్గొన్న గ్రామస్తులకు కరోనా సోకింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో 38 మందికి టెస్టులు చేయగా.. అందులో 26 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 123 కొత్త కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులోని చాలా మంది మహారాష్ట్ర నుంచి వచ్చినవారిగా గుర్తించారు. అయితే మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుుతండటంతో.. అక్కడి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసలు తిరిగి స్వగ్రామాలకు వస్తున్నారు. ఇలా వచ్చినవారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవుతోంది.