కరోనా విషయంలో రాబోయే 3,4 వారాలు చాలా కీలకమని.. జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. కోవిడ్ విషయంలో తెలంగాణ కాస్త మెరుగ్గా ఉందని.. మహారాష్ట్ర, కర్నాటకలాంటి రాష్ట్రాల కంటే మన రాష్ట్రం పరిస్థితి బాగుందని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. వందేళ్లకోసారి ఇలాంటి విపత్తులు వస్తాయని.. రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ వస్తుంది కాబట్టి ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్ పై హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియాలో డైరెక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడారు. 45 లక్షల మంది పైగా వాక్సిన్ తీసుకున్నారని వివరించారు. దశలవారీగా మిగతావారికి కూడా వాక్సిన్ వేయిస్తామని వెల్లడించారు. కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సింటమ్స్ ఉంటేనే కోవిడ్ ఉన్నట్టని, భయంతో పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరొద్దని కోరారు. లక్షణాలు ఉన్నవారు భయంతో పరీక్షలకు రావడం లేదని.. కానీ కోవిడ్ లేని వారు పరీక్షల కోసం వచ్చి వ్యాధి తెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సింటమ్స్ కేవలం రెండు మూడు రోజులు ఉంటాయని, తగ్గకపోతేనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 80 శాతం మందికి హాస్పిటల్స్ అవసరం లేదని.. చాలా వరకు ఇంట్లో డాక్టర్ల సలహాలతో కోలుకోవచ్చని డైరెక్టర్ శ్రీనివాసరావు గుర్తుచేశారు.