లాక్‌డౌన్ ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు అధికారికంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు, కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు కృష్ణబాబు స్పష్టం చేశారు. అయితే, కరోనా పరీక్షలు చేసిన తర్వాతే వారిని స్వస్థలాలకు పంపుతామని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఏపీకి చెందిన ఎవరైనా ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయినట్లయితే కంట్రోల్ రూం నంబర్‌కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. లేదా ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్‌ను కూడా ఆశ్రయించవచ్చని తెలిపారు.
కంట్రోల్ రూం నెంబర్. 0866 – 2424680 లేదా apcovid19controlroom@gmail.com ద్వారా సంప్రదించాలని కృష్ణబాబు విజ్ఞప్తి చేశారు.