Oxygen plants in Andhra Pradesh: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు నాలుగువేల మందికిపైగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక బాధితులంతా సతమతమవుతున్నారు. చాలామంది ఆక్సిజన్, వైద్యం అందక మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పలుచోట్ల ఆక్సిజన్ లేక ఏపీలో కొందరు మరణించిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిధులతో 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. దీంతోపాటు 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్‌లైన్ల ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు రూ.60 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. కోవిడ్ వైద్యానికి ఆక్సిజన్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
కాగా.. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇన్‌ఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే ఆక్సిజన్ దిగుమతిని ఆయన ఇకనుంచి పర్యవేక్షించనున్నారు. దీంతోపాటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లోటు ఏర్పడకుండా చర్యలు తీసుకోనున్నారు.
Also Read: