Vaccination: యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దాని ప్రభావాన్ని కోల్పోతుంది. కరోనాను అడ్డుకట్ట వేయడానికి ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. అందుకే ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే భారత్‌లో సుమారు 108 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు విజయవంతంగా ప్రజలకు ఇచ్చారు. వ్యాక్సిన్ కొరత తగ్గడం, అందరికీ అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ రేటు పెరుగుతోంది. అయితే ఇప్పటికీ కొందరు వ్యాక్సినేషన్‌పై అభద్రతలోనే ఉంటున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోన్న భయాలతో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారు ఉన్నారు. అయితే తాజాగా వారనాసిలో చోటు చేసుకున్న ఓ సంఘటన మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న భయాలను పటాపంచలు చేసేసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన స్వామీ శివానందన్ అనే వ్యక్తికి 125 ఏళ్లు. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. అయితే అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లే అతను కూడా వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నాడు. అంత వయసులో వ్యాక్సిన్ తీసుకుంటో ఏమవుతందోనన్న నిరాదార అనుమానాలు పెట్టుకోలేదు. దీంతో జూన్ 9న తన తొలి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాడు. ఇక తాజాగా దుర్గాకుండ్‌లో శివానందన్ విజయవంతంగా రెండో డోస్‌ను తీసుకున్నారు.
దీంతో భారతదేశంలో రెండు వ్యాక్సిన్‌లు తీసుకున్న అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా శివానందన్ సరికొత్త రికార్డును నెలకొలిపాడు. ఒక రకంగా చెప్పాలంటే బహుశా ప్రపంచంలోనే ఇంత వయసున్న ఏకైక వ్యక్తి శివానంద్ కావొచ్చు. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత విలేకర్లతో మాట్లాడిన శివానంద్.. తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పుకొచ్చాడు. ప్రతీరోజూ యోగా చేయడం, నూనె, మసాలాలు లేని ఆహారాన్ని తీసుకోవడం వల్లే తాను అంత ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
Also Read: Viral News: రెండు వారాల తర్వాత కోమా నుంచి తిరిగొచ్చిన యువతి.. ఆమె మాటలు విని డాక్టర్లు షాక్.!