AI Jobs: నష్టం కంటే లాభమే ఎక్కువ..! ఏఐ అంటే భయపడేవారికి భారీ గుడ్ న్యూస్
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు పెద్ద ప్రమాదం పొంచి ఉందని పెద్ద పెద్ద కంపెనీల అధినేతలు చెబుతూ వస్తోన్నారు. ఈ క్రమంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు మాత్రం ఏఐ వల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయంటున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగాలు ఊడిపోతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని రంగాల్లోకి ఏఐ వ్యాప్తిస్తోంది. అన్ని కంపెనీలు ఏఐను వాడుకుటుండటంతో వర్క్ ప్రొడక్టివిటీని పెంచుకోవడంతో పాటు పనిలో వేగం పెరుగుతోంది. పది మంది ఉద్యోగుల చేసే పనిని ఏఐ సాయంతో ఒక వ్యక్తి చేయవచ్చు. ఇక రానున్న కాలంలో మనుషులు చేసే పనులన్నీ రోబోలు చేసేస్తాయని, దీని వల్ల ఉద్యోగాలు లేక నిరుద్యోగం భారీగా పెరుగుతుందనే హెచ్చరికలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ఏఐ వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందని, మానవ మనుగడకే ముప్పు ఉందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. ఈ వాదనల క్రమంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన ఏమన్నారంటే..?
ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంకాప్ట్ సమ్మిట్ 2026 రెండో రోజు ఏఐలో వస్తున్న మార్పులపై చర్చ జరిగింది. మాజీ నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ టెక్నాలజీ పోల్ వాల్టింగ్‌లో ఏఐ పాత్ర గురించి హైలెట్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీధర్ వెంబు ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ రావడం నిజంగా మంచిదన్న ఆయన.. దీని వల్ల భారత్ మరింత వేగంగా వృద్ది చెందుతుందని వ్యాఖ్యానించారు. ఏఐ కోడ్ రాయగలుగుతుందని, ఐటీ కంపెనీలు ఇప్పటికే వినియోగదారులకు దగ్గరగా ఉన్నాయన్నారు. ఏఐ టూల్స్‌ను వేగంగా అమలు చేస్తే ఐటీ పరిశ్రమ వృద్ది చెందుతుందని తాను నమ్ముతున్నానన్నారు. ఏఐ సాంకేతికత వల్ల ఉద్యోగాలు నాశనం అవ్వవని, ఇంకా కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ శ్రీధర్ వెంబు భిన్నంగా వ్యాఖ్యానించారు. ఏఐ వల్ల ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నారు. భారతదేశంలో ఏఐ వినియోగం భారీగా పెరిగిందని, దీని వల్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని ఆయన పేర్కొన్నారు.
బిల్ గేట్స్ ప్రసంగం
ఈ ఏఐ సమ్మిట్‌కు ప్రపంచ బిలియనీర్ బిల్ గేట్స్ కూడా హాజరుకానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈవెంట్‌కు బిల్ గేట్స్ హాజరు కావడం లేదని, గ్లోబల్ విజనరీస్ జాబితా నుంచి ఆయన పేరు తొలగించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను బిల్ గేట్స్ తరపు ప్రతినిధి ఖండించారు. ఆయన హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు.
