Success Story: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాల్లో విజయవాడ కుర్రోడి సత్తా.. టాప్‌ 10లో ఒకేఒక్కడు!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాల్లో ఏపీకి చెందిన వడ్లమూడి లోకేశ్‌ జాతీయస్థాయిలో టాప్‌ 10వ ర్యాంకు సాధించాడు. గత కొన్నేళ్లుగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు టాప్‌ 10 ర్యాంకుల్లో కనీసం మూడు నుంచి ఆరు మంది వరకు ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం..

Success Story: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాల్లో విజయవాడ కుర్రోడి సత్తా.. టాప్‌ 10లో ఒకేఒక్కడు!
AP student secured 10th rank in JEE

Updated on: Jun 03, 2025 | 4:00 PM

హైదరాబాద్‌, జూన్‌ 3: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు సోమవారం (జూన్‌ 2) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన వడ్లమూడి లోకేశ్‌ జాతీయస్థాయిలో టాప్‌ 10వ ర్యాంకు సాధించాడు. గత కొన్నేళ్లుగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు టాప్‌ 10 ర్యాంకుల్లో కనీసం మూడు నుంచి ఆరు మంది వరకు ఉండేవారు. కానీ ఈసారి ఒకే ఒక్కరు ఉండటం గమనార్హం. తర్వాత ర్యాంకుల్లో ధర్మాన జ్ఞానరుత్విక్‌సాయి 18వ ర్యాంకు, వంగల అజయ్‌రెడ్డి 19వ ర్యాంకు, అవనగంటి అనిరుధ్‌రెడ్డి 20వ ర్యాంకులు సాధించారు. ఈ ఏడాది టాప్‌ 20లో నలుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు.

కాగా గత నెల 18వ తేదీన జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలను ఐఐటీ కాన్పుర్‌ సోమవారం ఉదయం వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన రజిత్‌గుప్తా 360కి 332 మార్కులు సాధించి ఫస్ట్‌ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఐఐటీ ఖరగ్‌పుర్‌ జోన్‌కు చెందిన దేవదత్త మాఝీ 312 మార్కులతో 16వ ర్యాంకు సాధించి అమ్మాయిల విభాగంలో తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 360 మార్కులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు. ఈసారి జనరల్‌ విభాగంలో 74 మార్కులు, ఓబీసీలకు 66 మార్కులు, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 66 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 37 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. గతేడాది జనరల్‌ విభాగంలో కటాఫ్‌ 109 మార్కులుగా ఉండటం విశేషం. దీంతో పోలిస్తే ఈసారి కటాఫ్‌ దాదాపు 35 మార్కులు తగ్గాయి. 2023లో 86 మార్కులు, 2022లో 55 మార్కులు, 2021లో 63 మార్కులు కటాఫ్‌గా ఉన్నాయి.

జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత సాధించారు. అయితే వీరిలో 1,87,223 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,80,422 మంది పరీక్ష రాశారు. అందులో కటాఫ్‌ మార్కుల ఆధారంగా 54,378 మంది జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. వీరిలో 44,974 మంది అబ్బాయిలు, 9,404 మంది అమ్మాయిలు ఉన్నారు. జోసా కౌన్సెలింగ్‌ మంగళవారం సాయంత్రం 5 నుంచి మొదలై మొత్తం 6 విడతలుగా జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.