న్యూఢిల్లీ, ఆగస్టు 25: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతియేట అఖిల భారత సర్వీసులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీయేట లక్షలాది విద్యార్ధులు ఈ పరీక్షలకు పోటీ పడుతుంటారు. వీటితోపాటు కేంద్ర విభాగాల్లో పలు ఉద్యోగాలకు నియామక పరీక్షలను నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించి నిర్వహించే వార్షిక పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది జనవరి 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఫిబ్రవరి 11వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. మే 25న ప్రిలిమ్స్, ఆగస్టు 22వ తేదీన మెయిన్స్ పరీక్షలు జరుగనుంది. అలాగే ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్, ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్ ఎగ్జామ్(1), బైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమ్స్) తదితర పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్, పరీక్ష తేదీల వివరాలను వార్షిక షెడ్యూల్ పేర్కొంది.
తెలంగాణ పీఈసెట్ 2024 తొలి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తైంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఎడ్)లో 1437 సీట్లకు గానూ 600 మంది, డీపీఎడ్‌లో 300 సీట్లకు గానూ 153 మంది ప్రవేశాలు పొందినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేశ్‌బాబు తెలిపారు. సీట్లు పొందిన వారు ఆగస్టు 28వ తేదీలోపు ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఆగస్టు 27 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.