
హైదరాబాద్, మే 26: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (మే 25) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం సెషన్‌లలో ప్రశాంతంగా జరిగింది. పేపర్ 1 పరీక్ష ఉదయం సెషన్‌లో, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం సెషన్‌లో జరిగింది. ఇందులో తొలుత పేపర్ 2లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే పేపర్ల 1 మూల్యాంకనం చేస్తారు. అయితే నిన్న జరిగిన సివిల్స్ ప్రాథమిక పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులతోపాటు అటు నిపుణులు కూడా చెబుతున్నారు.
లోతైన విశ్లేషణాత్మక పరిజ్ఞానానికి సంబంధించి ప్రశ్నలు వచ్చినట్లు చెబుతున్నారు. పేపర్‌లో మొత్తం 100 ప్రశ్నల్లో అత్యధికంగా చరిత్ర, ఇండియన్ పాలిటీ నుంచే 16 చొప్పున అడిగారని, ఆర్థికం- సామాజిక అంశాలపై 15 ప్రశ్నలు, జాగ్రఫీ నుంచి 14 ప్రశ్నలు, ఎన్విరాన్‌మెంటల్ సబ్జెక్ట్ నుంచి 13 ప్రశ్నలు, కరెంట్ ఆఫైర్స్ నుంచి 12 ప్రశ్నలు, జనరల్ సైన్స్ 9 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జి నుంచి 5 ప్రశ్నలు చొప్పున వచ్చినట్లు తెలుస్తుంది. నెగెటివ్ మార్కింగ్ ఉన్నందున ప్రతి తప్పు సమాధానానికి కోత ఉంటుంది.
దీంతో కేవలం ఏడాదిపాటు సన్నద్ధమైన వారికి ఈసారి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సాధారణంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కఠినంగానే ఉంటుంది. అయితే ఈసారి ప్రిలిమ్స్ పరీక్ష మరింత కఠినంగా వచ్చినట్లు నిపుణులు అంటున్నారు. ఇక మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 కూడా కఠినంగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అభ్యర్ధుల్లో కాస్త ఆందోళన నెలకొంది. అయితే పేపర్ కఠినంగా ఉంటే కటాఫ్ తగ్గే అవకాశం ఉన్నందున ఆన్సర్ కీ, ఫలితాలు వచ్చేంత వరకు కాస్త ఉత్కంఠ తప్పదు..!
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.