న్యూఢిల్లీ, నవంబర్ 17: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (యూజీసీ- నెట్) పరీక్ష నిర్వహణ షెడ్యూల్‌ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నట్లు యూజీసీ తెల్పింది. జనవరి 10న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఈ పరీక్ష జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. కాగా మొత్తం 83 సబ్జెక్టుల్లో అన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్టులకు నెట్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలోనే జరుగుతుంది. రెండు సెషన్లుగా పరీక్ష ఉంటుంది. నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులకు ఉంటుంది. పేపర్-2 పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. మొత్తం 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఐ నోటిఫికేషన్ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఎస్‌ఐ ఉద్యోగాల నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎత్తు అంశంలో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్ధులు పిటిషన్ వేశారు. గతంలో అర్హులైన తమను, ప్రస్తుతం అనర్హులుగా ఎలా ప్రకటించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్ల తరపున జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. వాదనాలు విన్న కోర్టు గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును ప్రశ్నించింది. ఈ క్రమంలో నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని బాధితుల తరపు న్యాయవాది కోరారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించి న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్‌ఐ నియామక ప్రక్రియ ఆగినట్లైంది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.