TSPSC Group 1 Prelims Exam Date 2022: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 (TSPSC Group 1 ) ద్వారా 503 పోస్టుల భర్తీకి తాజాగా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసింది. ఈ పోస్టులకుగానూ రికార్డుస్థాయిలో దాదాపు 3,80,202ల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటాపోటీగా ప్రిపరేషన్ కూడా కొనసాగుతోంది. వడపోత ప్రక్రియలో భాగంగా తొలుత నిర్వహించే ప్రిలిమ్స్ (Preliminary exam) పరీక్ష నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగ ప్రకటనలో జులై లేదా ఆగస్టు నెలల్లో ప్రిలిమినరీ ఉంటుందని కమిషన్ గతంలో ప్రకటించింది.
ఐతే సెప్టెంబరు నెలాఖరు వరకు పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకు, పోలీసు కొలువుల పరీక్షలకు షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. దీనితోపాటు సివిల్ సర్వీస్ స్థాయిలో నిర్వహించే గ్రూప్ 1కు ప్రిపేరవ్వడానికి సరిపడా సమయం ఇవ్వాలని కమిషన్‌కు అభ్యర్థులు విజ్ఞప్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రిలిమ్స్ తేదీపై ముందుకు వెళ్లాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
సాధారణంగా పోటీ పరీక్షలు సెలవు రోజుల్లో నిర్వహిస్తారు. ఆ ప్రకారం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఇప్పటికే ఆర్‌బీఐ, యూపీఎస్సీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ, ఎన్‌డీఏ, సీడీఎస్, సివిల్స్ మెయిన్స్ పరీక్షలతో షెడ్యూలు ఖరారైంది. ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు ప్రిలిమ్స్ ఉండటంతో ఆ నెలలో పరీక్ష నిర్వహిస్తే, రెండు ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే వారిలో ఎక్కువ మంది యూపీఎస్సీ పరీక్షలకూ హాజరవుతారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను కమిషన్ పరిశీలిస్తోంది. ఈ మేరకు కమిషన్ సమావేశమై అన్ని అంశాలను చర్చించిన తరువాత గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.