Inter Exams 2026: ఇంటర్‌ విద్యార్ధులకు మరో ఛాన్స్.. పరీక్షలకు ముందే ఆ వివరాల సవరణకు అవకాశం!

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. అయితే పరీక్ష ఫీజు చెల్లింపుల సమయంలో విద్యార్ధుల వివరాలు కొన్ని సార్లు తప్పుగా నమోదు..

Inter Exams 2026: ఇంటర్‌ విద్యార్ధులకు మరో ఛాన్స్.. పరీక్షలకు ముందే ఆ వివరాల సవరణకు అవకాశం!
Telangana Inter Nominal Rolls To Be Revised

Updated on: Nov 26, 2025 | 4:26 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. అయితే పరీక్ష ఫీజు చెల్లింపుల సమయంలో విద్యార్ధుల వివరాలు కొన్ని సార్లు తప్పుగా నమోదు చేయడం జరుగుతుంది. ఇటువంటి వివరాల సవరణకు అవకాశం ఇస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, గ్రూపు, మాధ్యమం, భాషా సబ్జెక్టులు తదితర వివరాల్లో తప్పులు దొర్లుతుంటాయి. ఓఎంఆర్‌ పత్రంలో సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగుకు బదులు హిందీ ఉందని, గ్రూపు మారిందని, తండ్రి పేరు తప్పుగా ముద్రించినట్లు విద్యార్థులు చెబుతుంటారు. అందుకే ప్రతి పరీక్ష కేంద్రానికి ఇంటర్‌ బోర్డు ఖాళీ ఓఎంఆర్‌ పత్రాలను పంపుతుంది. విద్యార్థులు వాటిల్లో అప్పటికప్పుడు మార్పులు చేసుకొని పరీక్షలు రాసేవారు. ఈసారి అలాంటి అవకాశం ఉండబోదు.

అయితే ఈ ఏడాది ఆ వివరాల సవరణకు పరీక్ష కేంద్రంలో కాకుండా పరీక్షలకు ముందే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు డీఐఈవోలకు, ప్రిన్సిపాళ్లకు బోర్డు స్పష్టత ఇచ్చింది. పరీక్షలకు ముందే విద్యార్ధులకు ఆయా కాలేజీలకు చెందిన ప్రిన్సిపల్స్‌ నామినల్‌ రోల్స్‌ చూపించి ఆ వివరాలను పరిశీలించుకోవాలని బోర్డు తెలిపింది. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రులను సైతం కాలేజీలకు పిలిచించి వారితోనూ క్రాస్‌ చెక్‌ చేయించి సంతకాలు తీసుకోవాలి. ఫలితంగా ఓఎంఆర్‌ పత్రాల్లో దొర్లే తప్పులను దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఇంటర్‌ బోర్డు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్లకు పరీక్షల ఫీజు, గడువు, నామినల్‌ రోల్స్‌లో వివరాల పరిశీలన, ప్రాక్టికల్స్‌ షెడ్యూల్‌ వంటి వివరాలకు సంబంధించి మెసేజ్‌లను పంపనున్నారు.

ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్ధులు తమ నామినల్‌ రోల్స్‌ వివరాల్లో పొరపాట్లను దిద్దుకునేందుకు నవంబరు 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అలాగే ఫీజు గడువు ముగిసిన తర్వాత కూడా మరోసారి అవకాశం ఇవ్వనుంది. ఇప్పటికే విద్యార్ధ్ఉలు 92% మంది పరీక్షల ఫీజు చెల్లించడంతో ఈ ప్రక్రియ సులువుగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు విద్యార్ధుల వివరాలను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.