
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన వెలువడింది. పాఠశాల విద్యాశాఖ తాజాగా సమాచారం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించిన విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే అదే తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు సరిగ్గా మార్చి 18వ తేదీనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు కూడా ముగియనున్నాయి. ఇక టెన్త్ పరీక్షలు ప్రారంభమైన వెంటనే మధ్యలో శ్రీరామనవమి పండగ వస్తుంది.
దీంతో మార్చి 26, 27 ఏదైనా ఒక తేదీలో శ్రీరామనవమి సెలవు రానుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభు త్వం సెలవుల జీవోను విడుదల చేస్తే గానీ ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నేడో, రేపో పడో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా ప్రారంభమైనాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 13 అంటే ఈ రోజు (గురువారం) వరకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పరీక్ష ఫీజుల చెల్లింపు గడువును కూడా మరో 10 రోజులు పొడిగించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మామాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్‌ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు వారు బుధవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఫీజు చెల్లింపు గడువు తో ముగియనున్నది. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఫీజు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నట్లు వారు వివరించారు. దీంతో గడువును 10 రోజులపాటు పొడిగించాలని వారు కోరారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఫీజు విషయానికొస్తే రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టులకు కలిపి రూ.110, 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించవల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.60 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేదు. వీరికి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. కాగా గత ఏడాది (2024-25) పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21, 2025న ప్రారంభమై ఏప్రిల్ 4, 2025 వరకు జరిగాయి. ఈ పరీక్షలు మొత్తం 15 రోజుల పాటు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే షిఫ్ట్‌లో అన్ని పేపర్ల పరీక్షలు జరిగాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.