హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. అయితే కామారెడ్డి జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ఇంటర్ వార్షిక పరీక్షల్లో పేపర్ లీకేజీకి యత్నించిన ఘటన కలకలంరేపింది. ఏకంగా అధ్యాపకులు, సిబ్బంది పేపర్ లీకేజీకి ప్రయత్నించి పోలీస్ అధికారులకు పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ పరీక్షాకేంద్రంలో శుక్రవారం ఇద్దరు లెక్చరర్లు పేపర్ లీకేజీకి ప్రయత్నించి పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ ఘటనపై పోలీసు విచారణ చేపట్టారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆ ఇద్దరు లెక్చరర్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో నాలుగు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పేపర్ -1కు పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షల్లో కరీంనగర్‌లో మూడు, నిజామాబాద్‌లో ఒకటి చొప్పున మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీఎస్ శాంతికుమారి
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిందితులు ఎంత పెద్దస్థాయిలో ఉన్నాసరే కఠిన చర్యలు తప్పవని సీఎస్ శాంతి కుమారి హెచ్చరించారు. ఆమె శుక్రవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్, పదోతరగతి పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని సీఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇంటర్ పరీక్షా పేపర్ లీకేజీకై ప్రయత్నించిన ఇద్దరు అధ్యాపకులు, సిబ్బందిని అరెస్టు చేశామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని పీఎస్ శాంతి కుమారి తెలిపారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 4,78,718 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు, 5,02,260 మంది సెకండ్ ఇయర్ విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,521 పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.