హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల తేదీని విద్యాశాఖ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఫలితాల తేదీపై జరుగుతోన్న చర్చ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లైంది. ఈ మేరకు పదో తరగతి ఫలితాల తేదీని ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చేతుల మీదుగా టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి.
కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 20వ తేదీతో మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తైంది. ఫలితాల డీ కోడింగ్ ప్రక్రియను ఈ వారం రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్ 30న ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇప్పటికే ఫలితాల ప్రకటనకు ఎన్నికల కమిషన్ నుంచి విద్యాశాఖ అనుమతి కూడా పొందింది.
మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 24వ తేదీ) ఉదయం 11 గంటలకు ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా సోమవారం అధికారిక ప్రకటన వెలువరించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in, https://tv9telugu.com/ వెబ్‌సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.