హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి నేడు, రేపు (డిసెంబర్ 15, 16) పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,368 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఉదయం సెషన్‌లో పేపర్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మధ్యాహ్నం సెషన్‌లో పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం నిబంధన వల్ల పలు చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులను అధికారులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించలేదు. వీరంతా కన్నీరు కారుస్తూ బయటే ఉండిపోయారు.
కాగా గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022, డిసెంబరు 29న ప్రకటన జారీ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం సెషన్‌లో జరిగిన గ్రూప్ 2 పేపర్ 1 పరీక్ష సమయంలో బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్ధులంతా ఎలాంటి సందేహాలు తావులేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. ఫలితాలు త్వరలోనే ఇస్తామన్నారు.
గ్రూప్ 2 పరీక్ష మొత్తం 4 పేపర్లకు జరుగుతుంది. ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుంది. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. డిసెంబర్ 16 (సోమవారం) పేపర్ 3, 4 పరీక్షలు జరగనున్నాయి.