హైదరాబాద్, జూన్ 13: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) ఫలితాలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిజల్ట్స్ విడుదల చేశారు. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం డీఎస్సీ ఆన్‌లైన్ అప్లికేషన్ గడువు కూడా పొడిగించింది. పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు, పేపర్-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం, పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగింది. ఇక ఈ ఏడాది జరిగిన టెట్-2024లో అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. టెట్ మెమోలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
తెలంగాణ టెట్ 2024 మార్కుల మెమోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈసారి జరిగిన టెట్ పరీక్షలో సర్కారు బడుల్లో టీచర్లుగా పనిచేస్తున్న పలువురు టీచర్లు గట్టెక్కలేకపోయారు. తొలిసారి రాష్ట్రంలోని దాదాపు 33 వేల మంది టీచర్లు టెట్ పరీక్ష రాశారు. వీరిలో కేవలం 18 వేల మంది అంటే 54 శాతం మాత్రమే క్వాలిఫై అయ్యారు. సబ్జెక్టులవారీగా చూస్తే పేపర్ 2 సోషల్‌లో 56 శాతం టీచర్లు క్వాలిఫై కాలేదు. పేపర్ 2 గణితం, సైన్స్‌లో 49 శాతం, పేపర్ 1లో 21శాతం చొప్పున టీచర్లు అర్హత సాధించలేకపోవడం గమనార్హం. పైగా ఫలితాలకు ఒకరోజు ముందు తుది ఆన్సర్ కీ విడుదల చేయడానికి బదులు.. ఫలితాలు విడుదల చేసిన తర్వాత సాయంత్రం ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అధికారులు పొందుపరిచారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.