హైదరాబాద్, ఆగస్టు 8: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు రోజుకో రెండు పేపర్ల చొప్పున నాలుగు పేపర్లకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్నీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషన్ సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచనుంది.
కాగా తెలంగాణలో వివిధ శాఖల్లో గ్రూప్ 2 కింద 783 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు గ్రూప్ 2కి దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్‌లైన్ పద్ధతిలో ఓఎంఆర్ విధానంలో పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా పరీక్ష కేంద్రాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాక డబుల్ బబ్లింగ్‌పై వివాదాలు తలెత్తేవి. దీంతో కోర్టులో అభ్యర్ధులు పిటీషన్లు దాఖలు చేయడం, ఫలితాల వెల్లడికి ఆలస్యం కావడం జరిగేది. దాదాపు రెండేళ్లకు పైగా గ్రూప్ 2 ఫలితాల కోసం అభ్యర్ధులు ఎదురు చూసేవారు. ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వివాదాలకు ఆస్కారం లేకుండా కమిషన్ కసరత్తు చేస్తోంది.
అందుకు పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన ఆయా విద్యాసంస్థలకు అధికారులు సమాచారం అందించారు. పరీక్షలు జరిగే ఈ రెండు తేదీల్లో పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించిన పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ఇస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. తొలుత వారాంతపు సెలవుల్లో పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ.. అప్పటికే వేర్వేరు పరీక్షలు ఉండటంతో అందుకు సాధ్యపడలేదు. దీంతో సాధారణ పనిదినాల్లోనే పరీక్షలు పూర్తిచేయాలనే కమిషన్ భావించింది. దీంతో ఫిబ్రవరిలోనే టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ఈ షెడ్యూలును విడుదల చేసింది. పరీక్ష నిర్వహణ అనంతరం సెప్టెంబరులోగా ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ కమిషన్ ప్రకటించనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.