హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2 నుంచి ప్రారంభమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఆన్‌లైన్ పరీక్షలు సోమవారం (జనవరి 20)తో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజుల పాటు టెట్ పేపర్-1, 2 పరీక్షలు జరిగాయి. ఈ రెండు పేపర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,05,278 మంది అంటే 74.44 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి ఓ ప్రటకనలో తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఆన్సర్ కీ, ఫలితాలకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. జనవరి 24న ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. కీపై అభ్యంతరాలుంటే జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో సమర్పించవచ్చని ఆయన సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఆన్సర్ కీ తయారు చేస్తారు. అనంతరం ఒకటి రెండు రోజుల్లోనే టెట్ ఫలితాలు కూడా వచ్చేస్తాయని ఆయన వెల్లడించారు.
రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత యేటా రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని, ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది రెండు సార్లు టెట్‌తోపాటు డీఎస్సీ నిర్వహించింది. ఈ మేరకు గత ఆగస్టులోనే 2024-25 సంవత్సరానికి ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినట్లుగానే 2024లో రెండో టెట్ జరిపింది. డీఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని, ఏప్రిల్‌లో పరీక్ష జరుపుతామని జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించింది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం ఆలోపు తేలుతుందో.. లేదోనన్న సందేహం సర్వత్రా నెలకొంది. వర్గీకరణపై స్పష్టత రాకున్నా నోటిఫికేషన్ జారీ చేస్తారా? అనేది తెలియడం లేదు.
ఎస్సీ వర్గీకరణ అంశం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే డీఎస్సీలో సుమారు 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.