Telangana SC Gurukulam: ఎస్సీ గురుకులాల్లో సీవోఈ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే

|

Aug 15, 2024 | 8:05 AM

తెలంగాణ ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు 2024-25 ఏడాదికి లాంగ్‌టర్మ్‌ ఐఐటీ-జేఈఈ, నీట్‌ కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు డిప్యుటేషన్‌పై గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్‌లలోని ఏడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు..

Telangana SC Gurukulam: ఎస్సీ గురుకులాల్లో సీవోఈ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే
Telangana SC Gurukulam
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 15: తెలంగాణ ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు 2024-25 ఏడాదికి లాంగ్‌టర్మ్‌ ఐఐటీ-జేఈఈ, నీట్‌ కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు డిప్యుటేషన్‌పై గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్‌లలోని ఏడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సీవోఈల్లోని ఒప్పంద సబ్జెక్టు నిపుణులకు వేళకు వేతనాలు ఇవ్వడంతో రాష్ట్ర సర్కార్‌ వైఫలం చెందుతోంది. దీంతో వారంతా జీతాల కోసం ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్య తలెత్తకుండా నివారించేందుకు నాన్‌ సీవోఈ గురుకులాల్లోని నిపుణులైన అధ్యాపకుల సేవలు వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆసక్తి కలిగిన గురుకుల అధ్యాపకులు ఆగస్టు 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి విఎస్‌ అలుగు వర్షిణి ప్రకటన జారీ చేశారు. మొత్తం ఖాళీల్లో మేథమెటిక్స్‌లో 13, ఫిజిక్స్‌ 12, కెమిస్ట్రీలో 15, బోటనీలో 8, జువాలజీలో 9 చొప్పున ఆయా సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

నేటితో ముగుస్తున్న తెలంగాణ ఎండీఎస్‌ వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలోని దంతవైద్య కాలేజీల్లో ఎండీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీలో భాగంగా తొలి విడత కింద అడ్మిషన్లకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ రోజుతో (ఆగస్టు 15వ తేదీ) ముగుస్తుంది. ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని విద్యార్ధులు ఈ రోజు గడువు సమయం ముగిసేలోపు నమోదు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో సూచించారు.

ఏపీ ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు జీవోకు సస్పెన్షన్‌ వేటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసే సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6న జారీ చేసిన జీవో 94ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈ జీవో ప్రకారం ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ అనుమతించకపోయినా, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని కళాశాలలను బలవంతం చేసినట్లుందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఇవి కూడా చదవండి

మైనార్టీ కళాశాలలు మినహా రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయాల్సిన మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్‌ కోటాకు కేటాయింస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 94ను సవాలు చేస్తూ నీట్‌ విద్యార్థులు పి చరిష్మాతో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని విచారించిన ధర్మాసనం ప్రైవేటు కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచకుండానే ఈడబ్ల్యూఎస్‌ కోటా భర్తీ ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఎన్‌ఎంసీ మాత్రం సీట్ల సంఖ్య పెంచాకే ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఇప్పటికే సీట్లు పెంచి, ఈడబ్ల్యూఎస్‌ అమలు చేస్తున్నారు. సీట్ల సంఖ్య పెంచకుండా ప్రైవేటు కాలేజీల్లో ఈ కోటా వర్తింపజేస్తే ప్రతిభ గల విద్యార్థులు నష్టపోతారని అభిప్రాయపడింది. మౌలిక వసతులు సమకూర్చుకొని, సీట్ల పెంపు కోసం NMCకి దరఖాస్తు చేసుకునేలా ప్రైవేటు కాలేజీలపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జీవో 94ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.