TS Police Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు త్వరలో శుభవార్త వినిపించనుంది ప్రభుత్వం. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు నియామకాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు శాఖలో ఖాళీలను గుర్తించి ఆ నివేదికను ఆర్థిక శాఖకు అందించారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. 19వేల కానిస్టేబుల్ పోస్టులు, 625 ఎస్సై పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం.
అయితే రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వరుస ఎన్నికలు, కరోనా విజృంభణ, జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాలకు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కొత్త జోన్లను అమల్లోకి తీసుకువస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను సైతం విడుదల చేయడంతో ఇక నియామక ప్రక్రియను పట్టాలెక్కించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా పోలీస్ శాఖలోనే ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 19, 449 పోస్టుల భర్తీకి అధికారులు పంపించిన ప్రతిపాదనలను సర్కార్ ఆమోదించింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.