హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎల్‌ఎల్‌బీ (LLB), ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ 2024, పీజీ ఎల్ సెట్ 2024 పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగించారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. అభ్యర్ధుల విజ్ఞప్తుల మేరకు మరో పది రోజుల పాటు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు లాసెట్ కన్వినర్ పేర్కొన్నారు. తాజా ప్రకటనతో ఏప్రిల్ 25 వరకు ఎలాంటి ఆలస్యరుసుం లేకుండా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మి ఈ సందర్భంగా సూచించారు.
కాగా న్యాయ కాలేజీల్లో మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరేందుకు ప్రతీయేట లాసెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. లాసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జనరల్ కేటగిరికి చెందిన వారు రూ.900, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. పీజీఎల్ సెట్‌కు అయితే జనరల్ అభ్యర్ధులు రూ.1100, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు రూ.900 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) ఆధ్వర్యంలో నిర్వహించే అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షను జూన్ 6వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణా శాఖ డైరెక్టర్ నవ్య ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యలో కోడ్ అమల్లో ఉన్నందున్న ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.