హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సంబంధిత బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జనవరిలో ఉంటుందని, ఫిబ్రవరి 1న ప్రాక్టికల్స్ ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నేడో.. రేపో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
ఒకరోజు ఫస్టియర్ విద్యార్ధులకు, మరోరోజు సెకండియర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇంటర్మీడియల్ ఫస్టియర్ విద్యార్థులకు తొలిసారిగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. దీంతో ఇంగ్లిష్ పేపర్‌ను 100 మార్కులకు కాకుండా 80 మార్కులకు కుదించారు. మిగిలిన 20 మార్కులకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. దీంతో వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్‌తో కూడిన షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేయనుంది.
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌పైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల రీ షెడ్యూల్‌పై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎంతో సమావేశం అనంతరం పరీక్షల షెడ్యూల్‌పై విద్యా శాఖ అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తం ఏడు రోజులపాటు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి నాలుగో వారంలో పరీక్షలు ముగియనున్నాయి. టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.