హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల కోసం లక్షలాది విద్యార్థులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తైనప్పటికీ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన వెలువరించలేదు. అయితే ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సాంకేతిక పరమైన ప్రక్రియ, పరిశీలన జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం ఫలితాలు ప్రకటించాలని బోర్డు భావిస్తోంది. కాగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూల్యాంకనం కూడా ప్రారంభించారు. ఏప్రిల్ 10 నాటికి 4 విడతల్లో మూల్యాంకనం పూర్తి చేశారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తి అయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి ఇస్తే ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 25లోపు ఫలితాల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఒకేసారి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వెలువరించానున్నారు.
ఈసారి తెలంగాణ ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించగా.. వీరిలో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.