తెలంగాణ ఇంటర్‌మీడియట్ విద్యలో కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అకౌంటెన్సీ సబ్జెక్టు ప్రాధాన్యతతో ‘సీఈఏ గ్రూపు’ను వచ్చే విద్యా సంవత్సరం (2023 – 24)లో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఇంటర్‌స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందిస్తున్నామని, బోర్డు సమావేశం దీనికి ఆమొదం తెల్పినట్లు ఇంటర్‌బోర్డు సెక్రెటరీ నవీన్ మిత్తల్ తెలిపారు.
కాగా ఇంటర్‌లో ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం గణితం, ఆర్థికశాస్త్రం, కామర్స్ సబ్జెక్టులతో ఎంఈసీ గ్రూపును ఇంటర్ విద్యలో ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి ఉన్న కోర్సుల్లోని సబ్జెక్టుల సిలబస్‌ను మాత్రం కాలానుగుణంగా మారుస్తూ వచ్చారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో 11, 12 తరగతుల్లో ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్న అకౌంటెన్సీ సబ్జెక్టును తాజాగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సీఈఏ గ్రూపుగా ప్రవేశ పెట్టనుంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లోని కామర్స్ సబ్జెక్టు పేరును కూడా మార్చనున్నారు. దీనికి కామర్స్ అండ్ అకౌంటెన్సీగా నామకరణం చేయనున్నారు. ఐతే సీఈఏ గ్రూపులో మాత్రం ఒక సబ్జెక్టుగా అకౌంటెన్సీ ఉన్నందున దానిలో కామర్స్ పేరు యథాతథంగా ఉంటుందని బోర్డు వెల్లడించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.