
డిగ్రీలో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా బీఏ డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ తో సహా 18 కోర్సులను తీసుకురావాలని చూస్తున్నారు. తొలుత సెలెక్టెడ్ కాలేజీల్లో వీటిని అమలు చేసి దానికి వచ్చే ఆదరణకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసర్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, డిగ్రీలో కామన్ సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్‌లో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.అలాగే సబ్జెక్టుల వారీగా 30 నుంచి 40 ప్రశ్నలతో కూడిన మెటీరియల్ ను కూడా విద్యార్థులకు అందించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని సైతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ అధికార వర్గాల సమాచారం.
డిగ్రీ తో పాటు జేఎన్టీయూ సిలబస్ లోనూ పలు మార్పులు చేయాలనే యోచనలో ఉన్నత విద్యామండలి ఉన్నట్లు తెలుస్తోంది. రీసెర్చ్ కల్చర్‌ను మరింతగా ప్రోత్సహించేలా సిలబస్ రూపకల్పన చేపట్టాలని చూస్తున్నది. రీసెర్చ్ లు ఎక్కువగా జరిగితేనే పేరు ప్రఖ్యాతలు వస్తాయని, అందుకే దీని వైపునకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. జేఎన్టీయూలో ప్రతి మూడేండ్లకోసారి సిలబస్ మార్చడం ఆనవాయితీ. ఆర్-22 పేరుతో మూడేండ్ల క్రితం సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిలబస్ గడువు ముగియనుండటంతో ఆర్-25 పేరుతో కొత్త సిలబస్‌ను రూపొందించనున్నారు.
అయితే ఇందుకోసం ఇప్పటికే కొంత మోడల్ సిలబస్‌ను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటర్న్ షిప్‌లు, కోర్సు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే అత్యుత్తమ సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. యూజీసీ ఆమోదంతో డిగ్రీలో మొత్తం 18 కొత్త కోర్సులను ఉన్నత విద్యా మండలి ప్రవేశ పెట్టనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.